ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 112 వ జయంతి
ఆంధ్రమాత ముద్దు బిడ్డలైన మహా పురుషులలో ఒకరు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు సదా:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు.
పొట్టి శ్రీరాములు వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. పేదరికం వలన వారు మద్రాసు సమీపంలో పొన్నేరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆర్ధికంగా వెసులుబాటు దొరకటంతో మద్రాసులోని జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటికి చేరారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు.
ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.
1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.
ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.
చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. నేటికీ మద్రాసు జనాభాలో 40% మంది తెలుగు వారున్నారు. "మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నారు శ్రీరాములు. ఆయన ఆశయం నెరవేరలేదు.